PODUPU KATHALU పొడుపు కథలు పొడుపు కథలను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. చిత్తూరులో పొడుపు కథలును మారు కథ అంటారు. అనంతపురంలో అడ్డుకథ అని, కర్ణాటక రాష్ట్రం కోలారు లో దీనిని ఒడ్డుకథ అని పిలుస్తారు. తెలంగాణలోని వరంగల్లు ప్రాంతంలో శాస్త్రము అని అంటారు. అనంతపురం ప్రాంతంలో కూడా అదేదో శాస్త్రం చెప్పినట్లు అని అంటారు. ఆంగ్లంలో పొడుపు కథలు ను రిడిల్ (RIDDLE)అని అంటారు. RIDDLE అను పదంRAEDON అను పదం నుంచి ఉద్భవించినది. పొడుపు కథలు నిర్వచనం: ఊహచే సమాధానాన్ని వెతికి, వినోదం ఆశ్చర్యాలతో పాటు గూడా అర్థాన్ని సవాలు చేసే ప్రశ్నార్ధక రూపక అతిశయోక్తి ప్రక్రియ పొడుపు కథ.
*నల్ల కుక్క కు నాలుగు చెవులు. లవంగం * తోలు నలుపు తింటే పులుపు– చింతపండు * ఒకటే తొట్టి, రెండు పిల్లలు. వేరుశనగ * జానెడు ఇంట్లో మూరెడు కర్ర. కుండలో గరిట
* పైన చూస్తే పండు, పగలగొడితే బొచ్చ . పత్తి కాయ
* నూరు పళ్ళు ఒకటే పెదవి. దానిమ్మ * పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. ఉంగరం * అయ్యకు అందవు అమ్మకు అందుతాయి. పెదవులు * చెయ్యని కుండ, పొయ్యని నీరు, వెయ్యని సున్నం తీయగనుండు. లేత కొబ్బరి కాయ * చిటారు కొమ్మ మీద మిఠాయి పొట్లం. తేనె పట్టు * అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్క లాడింది. కవ్వం * గోడమీద బొమ్మ! గొలుసుల బొమ్మ! వచ్చి పోయే వారిని వడ్డించే బొమ్మ! తేలు * సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊళ్ళోకి వచ్చి అరిచేది. శంఖం * రక్తసంబంధం రవ్వంత లేకుండా మానవాళికెల్ల మామగారు. చందమామ * పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక. నాలుక * శివరాత్రికి జీడికాయ ఉగాదికి ఊరగాయ. మామిడి పిందె * యంత్రం కానీ యంత్రం.సాయం త్రం
* మత్తు కానీ మత్తు. గమ్మత్తు * ఏడుగురు అన్నదమ్ములం మేము విడివిడిగా ఉంటే చెప్పగలరు కలిసి ఉంటే చెప్పలేరు. ఇంద్రధనస్సు * ఉరుములు మెరుపులు లేకుండా వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువు ఊరకనే నిండింది. కొబ్బరికాయ * ఊరంతటికీ ఒకటే దుప్పటి. ఆకాశం * నిద్రలో కూడా కన్నులు మూయనిది . చేప * కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడు గావు. కళ్ళు * చిటపట చినుకులు చిటారు చినుకులు. ఎంత రాలినా చప్పుడు కావు. కళ్ళు * గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చి పోయే వారికి వడ్డించు బొమ్మ. తేలు * చెట్టున పుట్టిన చెంగి, రాతిన పుట్టిన రంగి, తీగన పుట్టిన తిమ్మి, బావ నోట్లో వసంతము. తాంబూలం * ఇంట్లో కలి ఒంట్లో కలి. వాకలి, ఆకలి * వినే వాటికి కనే వాటికి బెత్తెడు దూరం. చెవులు, కన్నులు * పున్నమికి పూత– అమావాస్యకు ఆరగింపు . తేనెపట్టు * అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు పువ్వుల్లో రెండే కాయలు. సూర్యుడు, చంద్రుడు * తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు. పుస్తకం * నూరు చిలుకలకు ఒకటే ముక్కు. పళ్ళగుత్తి * వెండి గొలుసు వేయడమే గాని తీయలేము. ముగ్గులు * తీసే కొద్ది పెరిగేది. గొయ్యి * కాళ్లు ఉన్నా పాదాలు లేనిది. కుర్చీ * చక్కనమ్మ చిక్కినా అందమే. సబ్బు * ఒక స్తంభానికి నలుగురు దొంగలు. లవంగం * పచ్చని చెట్టు కింద ఎర్రని చిలక. మిరపపండు * తెల్లని పోలీసుకు నల్లని టోపీ. అగ్గిపుల్ల * గదినిండా రత్నాలు, గదికి తాళం. దానిమ్మపండు * ఊరంతా తిరిగి మూలన కూర్చో నేవి. చెప్పులు * ఇంట్లో మొగ్గ బయటకొస్తే పువ్వు. గొడుగు * చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు. అద్దం * పొట్టలో వేలు, తలపై రాయి. ఉంగరం * తోకలేని పిట్ట తొంబై ఆమడల దూరం వెళుతుంది. ఉత్తరం * ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు. ఉల్లిగడ్డ * ఎందరు ఎక్కిన విరగని మంచం. అరుగు * కాళ్లు లేవు గానీ నడుస్తుంది ,కళ్ళు లేవు గాని ఏడుస్తుంది. మేఘం * తల్లి దయ్యం పిల్ల పగడం. రేగుపండు *ముక్కు మీద కెక్కు. ముంద చెవులు నొక్కు. టక్కు నొక్కుల సోకు. జారిందంటే పుటుక్కు. కళ్ళజోడు * ఆకాశాన ఎగురుతుంది. పక్షి కాదు మనుషుల్ని ఎగరేసుకు పోతుంది. గాలి కాదు. ఏమిటది. విమానం * చారల పాము, చక్కని పాము, నూతిలో పాము, నున్న నైనా పాము. పొట్లకాయ * రాజు గారి తోటలో రోజా పూలు చూసే వారే గాని, లెక్కించేవారు లేరు . చుక్కలు * కిటకిట బండి కిటారు బండి. ఎందరు కూర్చున్న విరగని బండి. రైలు * పాప కాని పాప. కనుపాప * మత్తు కానీ మత్తు. గమ్మత్తు * యంత్రం కాని యంత్రం. సాయంత్రం * శివరాత్రికి శివ శివ అంటూ వెళ్లిపోయేది . చలి * సంతలన్నీ తిరుగుతాడు సమానంగా పంచుతాడు. త్రాసు * హద్దులేని పద్దు. అబద్ధం * నీళ్లలోనే పుడుతుంది నీళ్లలో పడితే అదృశ్యమవుతుంది. ఉప్పు * అనగనగా ఓ అప్సరస. పేరు మధ్యలో అక్షరాలు తీసేస్తే మేక. మేనక * అమ్మ తమ్ముడిని కాదు. కానీ నేను మీకు అందరికీ మేనమామ. చందమామ * ఆకు చిటికెడు. కాయ మూరెడు. మునగాకు * ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం. ముక్కు * ఇల్లంతా తిరిగి మూలన కూర్చునేది. చీపురుకట్ట * ఇల్లు కాని ఇల్లు. బొమ్మరిల్లు * ఆకాశాన కొడవళ్ళు వేలాడుతున్నాయి. చింతకాయలు * ఆ నాట్యకారిణి ఎప్పుడు లోపలే నాట్యం చేస్తుంది. నాలుక * ఆకాశంలో 60 గదులు, గదికో సిపాయి. సిపాయి కో తుపాకీ. తేనెపట్టు * ఎముక లేని పులి ఏటికి ఎదురీదే . జలగ * అందమైన అప్పన్న మూతి లాగి నాకన్నా. మామిడి * ఎద్దు పడుకుంటే , మోకు పారాడుతుంది. గుమ్మడికాయ * అమ్మ పడుకున్నది, బిడ్డ పారాడుతున్నది. విసురురాయి * రాత్రి పక్కలోకి- ఉదయం కుప్పలోకి. మల్లెపూలు * జల్లెడు పువ్వుల్లో జగన్నాథుడు. చంద్రుడు * తన శరీరాన్ని తానే తింటుంది. కొవ్వొత్తి * చూసేవి చెప్పలేవు, చెప్పేది చూడలేవు. కళ్ళు, నోరు * ఏటిలో కర్ర ముక్క ఎదురీదతుంది. పడవ * నల్లని నాంచారి కి నాలుగు చెవులు, నెత్తిన గుండు. లవంగం * జీవం ఉంది, రూపం ఉంది కదలలేదు. గుడ్డు * నిద్రలేని వయ్యారి- కులుకుతూ పారే వయ్యారి. నది * గరిక పోచల పై గాడిదలు నాట్యమాడెను. పేను * పుట్టెడు శనగలలో ఒకటే రాయి. చుక్కలు, చంద్రుడు * మూడింటిలో ముగిసే కథ. కట్టే ,కొట్టే, తెచ్చే * చిన్న ఇంట్లో చిరు చాప. నోరు, నాలుక * బక్క కుక్కకు బండెడు పేగులు. మంచం , నవారు * ఆకార పుష్టి నైవేద్య నష్టి. పుచ్చకాయ * సంపాదన ఒకరిది, అనుభవం మరొకరిది. చేతులు– కడుపు * పచ్చని తోటలో తెల్లని బంగ్లాలు తెల్లని బంగ్లాలో నల్లని దొరలు. సీతాఫలం * కాయ కాని కాయ. ఎండ్రకాయ * ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి- దీపం * ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. నిప్పు * తెల్లకోటు తొడుక్కున్న ఎర్ర ముక్క దొర. కొవ్వొత్తి * వెండి కోటలో బంగారపు రాశి. కోడిగుడ్డు * సూర్యుడు చూడని గంగ, చాకలి తాకని చెరువు. కొబ్బరికాయనీళ్లు * అరచేతిలో లెక్కించలేనన్ని ఇళ్ళు వాటికి వెళ్లే దారే గాని, వచ్చే దారి లేదు. జల్లెడ * క్రమమైన పయనం, నల్లపూసల సైన్యం. నల్లచీమలదండు * హద్దులేని పద్దు, అదుపులేని ఎద్దు ఎన్నడు ఆడొద్దు. అబద్ధం * నీరు లేని సముద్రాన్ని భద్రంగా దాటించే ఓడ. ఒంటె * రెండు రాజ్యాల భీకర యుద్ధం, కత్తులు లేని నిశ్శబ్ద పోరాటం. చదరంగం *నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, మురికిగా ఉన్నప్పుడు తెల్లగా అయిపోతాను. బ్లాక్‌బోర్డ్ * తల లేదు కానీ రక్షణకు గొడుగు ఉంది పాము లేదు కానీ పుట్ట ఉంది. పుట్టగొడుగు * అందరూ నన్ను తినటానికే కొనుక్కుంటారు, కానీ ఎవరు నన్ను తినరు. కంచం * వెలుతురు ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాను. చీకటి పడితే మాయం అవుతాను. నీడ * నీటిలో ఉంటే ఎగిసి పడతాను నేల మీదకు రాగానే కూల బడతాను. కెరటం * జానెడు ఇంట్లో, మూరెడు కర్ర. కుండలోగరిటె * కొప్పు ఉంది కానీ జుట్టు లేదు, కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు. కొబ్బరికాయ * సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు. సూది * పొడవాటి మానుకి నీడే లేదు. దారి * పైడి పెట్టెలో ముత్యపు గింజ. వడ్లగింజలు * పూజకు పనికిరాని పువ్వు, పడతులు మెచ్చే పువ్వు. మొగలిపువ్వు * బండకు కొడితే వెండి ఊడుతుంది. కొబ్బరికాయ * అది లేకపోతే ఎవరు ఏమి తినరు. ఆకలి * అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు ఏమిటది. పుట్ట
* లోకజ్ఞానం కలుగుతుంది, శాస్త్ర విషయాలు తెలుస్తాయి. * జ్ఞాపకశక్తిని, ఆలోచన శక్తిని పెంచును. * సమన్వయ శక్తిని, జిజ్ఞాసను కలిగిస్తాయి. * వాక్చాతుర్యం అభివృద్ధి చెందును. * ఏకాగ్రత పెరుగుతుంది, * మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయి.